Logo
రైతుకూలీసంఘం[ఆం.ప్ర.]
రైతుకూలీసంఘం సమావేశం

రైతుకూలీ సంఘం (ఆంధ్రప్రదేశ్)

ఆశయాలు - కర్తవ్యాలు


భారతదేశం ప్రకృతిసిద్ధ వనరులకు నిలయం. నిరంతరం పారే జీవనదులు, సారవంతమైన విస్తృత వ్యవసాయ భూములు, భూగర్భ (జల, ఖనిజ) సముద్ర వనరులు, అటవీ సంపద పుష్కలంగా వున్న జీవగడ్డ. అపారమైన మానవ శ్రమశక్తి గల దేశం. ఇన్ని వున్నా మన ప్రజల బ్రతుకుల్లో వెలుగురేఖలు ప్రసరించలేదు. తిండి, గుడ్డ, గూడు సమస్యలింకా పరిష్కరించబడలేదు. చదువు, సంస్కృతి, విజ్ఞానాలకు బదులు నిరక్షరాస్యత, నిరుద్యోగం, మౌఢ్యం, అజ్ఞానం రాజ్యమేలుతున్నాయి. ఒక్క మాటలో భారత ప్రజల బ్రతుకు చీకట్లో తడుములాటగా వుంది.

1947లో అధికార మార్పిడి జరిగిన తర్వాత కూడా భారతదేశ భూస్వామ్య, బడా బూర్జువా వర్గాలు సామ్రాజ్యవాదుల అడుగులకు మడుగులొత్తే విధానాలనే అనుసరించాయి. గ్రామీణ పేదలు - రైతాంగం, వ్యవసాయ కూలీలు, గ్రామీణ చేతి వృత్తులవారు, ఇతర మైనారిటీలు - అధికార మార్పిడికి ముందూ, ఆ తర్వాత కూడా పెద్దఎత్తున పోరాటాలు సాగించారు. మునగాల, కాళీపట్నం, వెంకటగిరి, మందసా రైతాంగ పోరాటాలు, నేటి ఆంధ్రప్రదేశ్‌ల్లోని తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం, చల్లపల్లి రైతాంగ పోరాటాలు ఫ్యూడలు జమీందార్లు, రాజులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలే, భూమి కోసం, భుక్తి కోసం, ఫ్యూడలిజం నుండి విముక్తి కోసం జరిగిన పోరాటాలే.

ఆనాటి ఆంధ్రలో అనేక సాంఘిక సంస్కరణోద్యమాలు సామ్రాజ్యవాద వ్యతిరేక జాతీయోద్యమంలో భాగంగా జరిగాయి. భూమి కోసం, కూలిరేట్ల కోసం, అధిక పన్నులు, అధిక కౌళ్లకు వ్యతిరేకంగా, సాంఘిక అణచివేతకు వ్యతిరేకంగా, గ్రామీణ పేదలు సాగించిన పోరాటాలు ఫ్యూడలు దోపిడీ వర్గాలను ఖంగు తినిపించాయి. ఆ ఉద్యమాల ఫలితంగా పెరిగిన సాంఘిక, ఆర్ధిక, రాజకీయ చైతన్యం వర్గ పోరాటశక్తిగా సంఘటితపడింది. ఎస్టేటు, జమీందారీ ప్రాంతాలలో రైతాంగ పోరాటాలు విజృంభించాయి. వందలు, వేల ఎకరాలు గల భూస్వామ్యవర్గంపై గ్రామీణ పేదలు దండెత్తారు. ఎన్నో పాక్షిక విజయాలనూ, కొన్ని పూర్తి విజయాలనూ సాధించారు. ఫ్యూడలు అధికారాన్ని, పెత్తనాన్నీ సవాలు చేసి గ్రామీణ పేదలు - రైతు కూలీలు, ఇతర గ్రామీణ వృత్తుల వారు నిలబడ్డారు. ఫ్యూడలు సంకెళ్లను తెంచివేయగల మహాశక్తిగా ముందుకొచ్చారు. ‘బాంచను నీ కాల్మొక్కుతా దొరా’ అనే తెలంగాణా గ్రామీణ పేదలు ఫ్యూడలు దొరల దోపిడీ దౌర్జన్యాలనూ, సాంఘిక అణచివేతలకు వ్యతిరేకంగా సాగించిన అద్వితీయమైన పోరాటం - నవాబుల, దొరల పీచమణచివేసింది.

దేశవ్యాపితంగా సాగిన అనేక రైతాంగ పోరాటాలు నాటి తిరువాన్కూరు - కొచ్చిన్‌లో పున్నప`వాయలార్, మహారాష్ట్రలోని వర్లి, గుజరాత్‌లోని జునాగఢ్, బెంగాలులోని తెభాగా, బీహారులోని భక్నస్, నాటి పంజాబులోని పాటియాలా రైతాంగ పోరాటాలు మహత్తర శక్తిగా సాగాయి. వీటితో పాటు కార్మికుల సమరశీల పోరాటాలు, నావికుల తిరుగుబాటు బ్రిటీషు సామ్రాజ్యవాదానికి సాంఘిక పునాదిగానూ, రాజకీయ వత్తాసుగానూ ఉన్న ఫ్యూడలు దళారీ బూర్జువా వర్గాలను హడలెత్తించాయి. బ్రిటీష్ సామ్రాజ్యవాదం ప్రజల చేతులలోకి అధికారం పోవటం కంటే, తన సేవకులైన ఫ్యూడలు దళారీ వర్గాల చేతికి అధికారాన్ని అప్పగించి తన సామ్రాజ్యవాద దోపిడీ ప్రయోజనాలను కాపాడుకోవాలనుకుంది. ఆవిధంగా అధికార బదలాయింపు జరిగింది. ఫ్యూడలు వర్గాల పరిరక్షణ - ప్రజా పోరాట విజయాలను వమ్ముచేయటమన్న విధానాలను అవి అనుసరించాయి. దోపిడీ వర్గాల కత్తికి రెండువైపులా పదును పెట్టుకున్నాయి. ప్రజా ఉద్యమాలను అణచడానికి నిర్బంధం, సంస్కరణలు అన్న ద్వంద్వ విధానాలనే అనుసరించాయి.

1947లో అధికారంలోకి వచ్చిన స్థానిక పాలకవర్గాలపై ` ఫ్యూడలు, దళారీ బూర్జువా వర్గాలపై కూడా ప్రజా పోరాటాలు కొనసాగాయి. తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం, ఎస్టేటు జమీలలో ప్రజల తిరుగుబాట్లు, భూస్వామ్య దోపిడీ పీడనలకు వ్యతిరేకంగా పేద రైతాంగం వ్యవసాయ కూలీలు సాగించిన పోరాటాల ఫలితంగా పాలక వర్గాలు వినోబా భావే భూదాన కార్యక్రమం, ఎస్టేటు ఎబాలిషన్ (రద్దు), జమీందారీల రద్దు, భూగరిష్ట పరిమితి చట్టాలు, కౌల్దారీ రక్షణ చట్టాలు, కనీస వేతన చట్టాలు తెచ్చాయి. పోరాడుతున్న ప్రజలపై మత్తుగుళికల ఫలహారం లాంటి ఈ సంస్కరణలు - చట్టాలను పాలకవర్గాలు కుమ్మరించాయి. పోరాట విస్తృతిని, గమనాన్ని, గమ్యదిశనూ మార్చే ఎత్తుగడలను ప్రయోగించాయి.

రైతాంగ ఉద్యమ రాజకీయ నాయకత్వం పాలకవర్గాల ఎత్తుగడలకు లోబడింది. రైతాంగ ఉద్యమ విజయాలను, ఫలాలను ప్రజలు పోగొట్టుకోవలసి వచ్చింది. కొన్ని విజయాలను కొంతకాలం మాత్రం నిలబెట్టుకోగలిగారు. అన్నిటికన్నా ముఖ్యమైనది రైతాంగ పోరాటాలు రాజకీయ ఆయుధాన్ని కోల్పోవడమన్నదే. ఇది రైతాంగ ఉద్యమాల పాలిట శాపంగా మారిన ఘోరపరిణామం.

అయిన్పటికీ, రైతాంగం అప్పటివరకూ నేర్చుకున్న వర్గపోరాట ఆయుధంతో ఆ తర్వాతి కాలంలో ఎన్నో పాక్షిక సమస్యలపై పొరాటాలు సాగించారు. బంజరు భూములు సాగునీటి ప్రాజెక్టులు, మురుగు నివారణ, అధిక పన్నులకు వ్యతిరేకంగా పెద్ద పెద్ద ప్రజా సమీకరణలు సత్యాగ్రహ పోరాటాల ద్వారా కొన్నింటిని సాధించారు. అయితే మౌలిక సమస్య అయిన భూమి సమస్య పరిష్కారం కాకపోవటం వలన, ప్రభుత్వ సంస్కరణలు బూటకమైనవి కావటం వలన, 1960 దశకంలో రైతుకూలీలు మిలిటెంటు పోరాటాలకు దిగవలసి వచ్చింది. భూస్వామ్య వర్గాలతో ఘర్షణకు తలపడవలసి వచ్చింది. చట్టాలు - సంస్కరణలు ప్రజలకు కొరగానివిగా మారాయని స్పష్టమౌతున్న సమయమిది.

సామ్రాజ్యవాదుల దోపిడీకి మరెన్నో మార్గాలను భారత పాలకులు తెరిచి వుంచారు. వ్యవసాయ రంగంలో సామ్రాజ్యవాద దోపిడీ దుష్ఫలితాలను రైతాంగం అనుభవించింది. వ్యవసాయ రంగ సంక్షోభం అన్ని రంగాలకూ విపత్తును కల్పించింది. కష్టజీవులైన భారత రైతాంగపు, కార్మికవర్గపు శ్రమ ఫలితాలు వారు సృష్టించిన సంపదలు సామ్రాజ్యవాద దేశాలకు ప్రవహింపచేసుకున్నారు. అంతేకాదు. భారత మేధావుల మేధస్సును కూడా సామ్రాజ్యవాద దేశాలకు ప్రవహింపచేసుకున్నారు. మన రూపాయిని అమెరికా డాలరు శాసించింది.

1950 దశకంలో సాధించుకున్న విజయాలు మరింత వమ్ముకాసాగాయి. భూస్వాముల దౌర్జన్యకాండ మితిమీర సాగింది. పేదరైతులు, వ్యవసాయ కూలీలపై ఎస్‌సి, ఎస్‌టి, బిసిలపై భూస్వామ్య అగ్రకుల శక్తులు స్వైరవిహారానికి పూనుకున్నాయి. ఈ పరిస్థితులలోనే ప్రజలు ఎన్నో మిలిటెంటు పోరాటాలకు దిగారు. ఒక వర్గం కాదు - అన్ని వర్గాల ప్రజలు మిలిటెంటు పోరాటాలకు దిగారు. నక్సల్బరీ, శ్రీకాకుళం గిరిజన పోరాటాలు మరోసారి మార్గనిర్దేశం చేసే స్థాయికి చేరాయి. మళ్ళీ పాలకవర్గాలు ఉద్యమాలను కఠినంగా అణచివేయటం; చట్టాలు ` సంస్కరణల ద్వారా ప్రక్కదారి పట్టించడమన్న ద్వంద నీతినే అమలు జరిపారు.

1960-1970 దశకాలలో సహకార వ్యవసాయం, ప్రభుత్వ వ్యవసాయ క్షేత్రాల రూపకల్పన, సాంద్ర వ్యవసాయము, పైరు పచ్చ విప్లవము, సామ్రాజ్యవాద ప్రయోజనాలకి అనుగుణ్యమైన వ్యవసాయ విద్య, వ్యవసాయ పరిశోధనా కేంద్రాలు, బ్యాంకుల జాతీయకరణ లాంటివి అన్నీ మరోసారి భ్రమలలో ముంచటానికి సామ్రాజ్యవాదుల వుచ్చుని బిగించడానికి తీసుకొచ్చాయి.

రాజభరణాలు రద్దు, ముఠాదారీ, మాల్గుజారీ పద్ధతుల రద్దు వంటివన్నీ చిత్తశుద్ధితో చేసినవి కావు. ప్రజలలో పెరుగుతున్న అసంతృప్తి దాని ఫలితంగా పెరుగుతున్న మిలిటెంట్ పోరాటాలపై నీళ్ళు చల్లటానికే తీసుకొచ్చారు. అయినప్పటికీ ప్రజా ఉద్యమజ్వాలలు రగులుకొన్నాయి. ప్రజా ఉద్యమాలు అలలు, అలలుగా సాగుతూనే ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలు (వియత్నాం, అంగోలా, లావోస్, కంబోడియా, మొ॥) అభివృద్ధి చెందుతున్న దేశాలలో స్థానిక భూస్వామ్య శక్తులకు, సామ్రాజ్యవాద దురాక్రమణలకు వ్యతిరేకంగా ఆనాడు సాగిన విప్లవ ఉద్యమాలు కూడా నాటి భారత రైతాంగ పోరాటాలకి ప్రేరణనిచ్చాయి.

నక్సల్బరీ, శ్రీకాకుళ రైతాంగ ఉద్యమాలను అదుపు చేయగలిగామని పాలకవర్గాలు అనుకున్నప్పటికీ తమ సామ్రాజ్యవాద అనుకూల, భూస్వామ్య అనుకూల విధానాల వల్ల పెరుగుతున్న ప్రజా అసంతృప్తి, దాని మÖలంగా వస్తున్న పోరాటాలను చూసి అవి భయపడ్డాయి. 1975లో ఎమర్జెన్సీ పాలన విధించి ఉద్యమ వెల్లువలను ఆపాలని ప్రయత్నించాయి. ప్రజాస్వామిక హక్కులను కాలరాచి పాశవిక నిర్బంధాన్ని అమలు చేయటంతో పాటుగా, 20 అంశాల కార్యక్రమము వంటి నినాదాలతో సంస్కరణల భ్రమలలో ముంచెత్త చూసాయి.

ప్రజలను మోసగించే సంస్కరణల బూటకత్వం బయటపడటంతో దోపిడీ పాలకులు వ్యూహాన్ని మార్చారు. వ్యవస్థాపరంగా మార్పులు తెచ్చే సంస్కరణలు, నినాదాల స్థానంలో ప్రజాకర్షక విధానాలను ప్రవేశపెట్టారు. దీనితోపాటు ఎమర్జెన్సీ నాటి నిర్బంధ చట్టాలన్నింటినీ రోజువారీ చట్టాలుగా మార్చారు. రూపం మారినప్పటికీ నిర్బంధం - సంస్కరణల బొమ్మా - బొరుసూ విధానమే ఇది. పాలకులు అంతటితో ఆగలేదు. సామ్రాజ్యవాదుల దోపిడీ దాహం తీర్చడానికి దేశ వనరులన్నంటినీ వారి పాదాక్రాంతం చేసేందుకు చర్యలు తీసుకున్నారు. దీనితో ఆర్ధిక సంక్షోభం మరింత తీవ్రమైంది.

80వ దశకంలో ఐ.ఎం.ఎఫ్ రుణాలతో సామ్రాజ్యవాద కబంధ హస్తాలను విస్తరింపచేశారు. 90వ దశకంలో నూతన ఆర్ధిక విధానాల రూపం తీసుకుంది. ప్రపంచ బ్యాంకు (వరల్డ్ బ్యాంకు) అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐ.ఎం.ఎఫ్) ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటిఓ)లను ముందు పెట్టి తమ పెట్టుబడి ఎగుమతికి, దోపిడీకి ఎలాంటి ఆటంకం లేకుండా అన్ని దేశాలను తమ స్వంత మార్కెట్లుగా మార్చుకొనే ప్రపంచీకరణ నినాదాన్ని సామ్రాజ్యవాదులు ముందుకు తెచ్చారు. దీనితో దేశ ప్రజల జీవన రంగాలన్నింటిలోకి సామ్రాజ్యవాద దోపిడీ చొరబడి విస్తరించింది.

సాగునీటి ప్రాజెక్టులు, ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు, మార్కెట్టు సౌకర్యాల విషయంలో మన భారత పాలకులు పరాధీన విధానాలను అనుసరిస్తున్నారు. దేశ ప్రజల అవసరాలు, దేశాభివృద్ధి ప్రాతిపదికలను వదిలేసారు. సామ్రాజ్యవాద అధిపతుల సరుకులు అమ్మడానికి వారికి కావలసిన ముడిసరుకులు ఉత్పత్తి చేసే విధంగా వ్యవసాయరంగ వ్యూహాన్ని తీర్చిదిద్దారు. ఈ విధానాలు గ్రామీణ ప్రజా జీవితాలను సంక్షుభిత భరితం చేసాయి.

గత్యంతరం లేని స్థితిలో ప్రజలు ఆందోళన, పోరాట మార్గాలను చేపడుతున్నారు. ఈ పోరాటాలను ప్రక్కదారి పట్టించడానికి పాలకులు మరింత ఉధృత రూపంలో ప్రజాకర్షక విధానాలను కుమ్మరించారు. నిష్ఫలమైన ఈ పథకాలు ప్రజలను సంతృప్తి పరచలేదు. ప్రజా చైతన్యం అణగారిపోలేదు. ఐతే దోపిడీ వర్గాలు ఈ చైతన్యాలను నీరు గార్చే ప్రయత్నాలను మొదలుపెట్టారు. కుల, మత, ప్రాంతీయ విద్వేషాలను రగిల్చి ప్రజలు సంఘటితపడకుండా చీల్చే ప్రయత్నాలు చేశారు.

ప్రజలు నిత్య జీవిత సమస్యలే కాక జాతీయ ప్రజాస్వామిక ఆకాంక్షలు, కోర్కెలు ముందుకు వచ్చాయి. ఇలా ముందుకు వచ్చిన ఉద్యమాలను సంకుచిత పరిధిలోకి మలిచే కుట్రను దోపిడీ శక్తులు సాగించాయి. నేటికీ సాగిస్తున్నాయి. కుల, మత, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి ప్రజల చైతన్యాన్ని సంఘటిత శక్తిని, సంకుచిత పరిధిలో ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు.

సామ్రాజ్యవాదులు ప్రత్యక్షంగా, పరోక్షంగా సమకూర్చే నిధులతో ప్రభుత్వేతర సంస్థలను ముందుకు తెచ్చారు. అభ్యుదయ పదజాలం వల్లించసాగారు. వ్యక్తిగత స్థాయిలో, స్వశక్తితో, అభివృద్ధి సాగించివచ్చునన్న భావ ప్రచారంతో ప్రజలను సంఘటిత కృషి నుంచి, పోరాట పథం నుంచి మళ్ళించే ప్రయత్నాలు చేశారు. దోపిడీ వ్యవస్థకు హాని జరగని, దానికి ప్రయోజనం సమకూర్చే కార్యకలాపాలలోకి, ప్రజల సృజనాత్మక శక్తిని మళ్ళించ చూస్తున్నారు.

అదే సందర్భంలో పెరుగుచున్న ప్రజా పోరాటజ్వాలను ఆర్పడానికి ప్రజాస్వామిక హక్కులకు రాజ్యాంగ భద్రత లేకుండా చేస్తున్నారు. నిర్బంధ యంత్రాంగాన్ని రాజ్యాంగ చట్టానికి, న్యాయ వ్యవస్థకు అతీతమైన శక్తిగా రూపొందిస్తున్నారు. ప్రస్తుత న్యాయవ్యవస్థను కూడా దోపిడీ వర్గ ప్రయోజనాలకు మరింత అనుగుణంగా మలుస్తున్నారు.

భూస్వామ్య విధానం, సామ్రాజ్యవాదం భారత ప్రజల ప్రధాన శత్రువులు. భూస్వామ్య విధానం సామ్రాజ్యవాదానికి సామాజిక పునాదిగా ఉండగా, సామ్రాజ్యవాదం, భూస్వామ్య విధానాన్ని రక్షిస్తున్నది. పరస్పర సంబంధం, పరస్పర ఆధారాలతో ఉన్న ఈ రెండింటినీ నాశనం చేయకుండా భారత సమాజ పురోగమనం సాధ్యం కాదు. ప్రజల అభ్యున్నతికి, పురోగమనానికి ఇవి రెండూ ప్రధాన ఆటంకాలుగా ఉన్నాయి. కనుకనే నేటి భారతదేశంలో ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా ప్రజాతంత్ర విప్లవం కోసం జరిగే పోరాటము, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జాతీయ విముక్తి కోసం జరిగే పోరాటము విడదీయరాని విధంగా పెనవేసుకొని ఉన్నాయి.

కనుకనే సామ్రాజ్యవాదము, ఆర్ధిక రంగానికో, పారిశ్రామిక రంగానికో పరిమితమైనదిగాను, భూస్వామ్య విధానాన్ని వ్యవసాయ రంగానికి పరిమితమైందిగాను, రైతుకూలీ ఉద్యమం పరిగణించడంలేదు. సామ్రాజ్యవాదులు అమలు జరిపించిన పైరుపచ్చ విప్లవంతో వ్యవసాయ రంగంలోకి సామ్రాజ్యవాదుల పెరుగుతున్న చొరబాటును, దేశ ఆర్ధిక, రాజకీయ, సామాజిక వెనుకబాటుతనాన్ని శాశ్వతం చేసే ప్రయత్నాన్ని ముప్పయి సంవత్సరాల క్రితమే రైతుకూలీ ఉద్యమం గమనంలోకి తీసుకుంది. ఈ విధానం కొనసాగింపుగానే నేటి ప్రపంచీకరణ వ్యూహం ఉన్నది. ఇది దేశ వ్యవసాయ రంగాన్ని సామ్రాజ్యవాదులకు ముడి సరుకులు సరఫరా చేసేదిగాను, సామ్రాజ్యవాద కంపెనీ సరుకులకు మార్కెట్టుగా మార్చేదిగాను ఉంది.

దీని ఫలితంగా గ్రామీణ ప్రాంతంలో కొత్త తరహాలో మరింత క్రూరంగా భూస్వామ్య విధానం బలీయమవుతున్నది. వ్యవసాయ రంగం సామ్రాజ్యవాదానికి తోకగా మారుతూ ఉన్నది. కౌలుదారులను పేద రైతులను భూమిలేని కౌలు రైతులుగా, కూలీలుగా మార్చుతూ ఉన్నది. భూమి నుండి బలవంతంగా తొలగించబడడంతో మరో ఉపాధి సౌకర్యం ఏర్పడకుండా, వ్యవసాయ కూలీ జనాభా పెరగడం; వలసలు పోయే పరిస్థితి కల్పించడం; క్రింద కులాలపై అగ్రకులాల ఆధిపత్యం పెరగడం - భూస్వామ్యులకు పేద రైతులకు, వ్యవసాయ కూలీలకు మధ్య వైరుధ్యాలు పెరగడం - ఇది అనివార్యంగా తీవ్రమైన వర్గ పోరాటాలకు దారి తీస్తున్నది.

నేటి ఈ పరిస్థితి ప్రజలు గతంలో ఎప్పటికంటే నిర్మాణాత్మకంగా సంఘటితం కావలసిన ఆవశ్యకతను, అవసరాన్ని తెలియజేస్తున్నది. అందుకే రైతు కూలీ సంఘం ప్రణాళికా బద్ధంగా, తన కర్తవ్యాలను పరిపూర్తి చేయడానికి నిశ్చయాత్మకంగా పూనుకొంటున్నది. ఈ క్రింది ప్రణాళిక దృక్పధాన్ని రైతుకూలీల ముందు ఉంచుతున్నది.

I

  1. భారతదేశం గ్రామాల సముదాయం. సామ్రాజ్యవాద దోపిడీకి సాంఘిక పునాదిగా వున్న భూస్వామ్య వర్గం, సామ్రాజ్యవాదులచే సృష్టించబడి పెంపుడు కుక్కల్లా తెగబలిసివున్న బడా బూర్జువా వర్గమÖ (దళారీ బూర్జువా) ఈ వ్యవస్థకు కాపలా కాస్తూ కాపాడుకుంటున్నాయి.
  2. బ్రిటీషు సామ్రాజ్యవాదులచే ప్రవేశపెట్టబడిన 1935 భారత ప్రభుత్వ చట్టం కొనసాగింపుగానే 1950 రాజ్యాంగ చట్టం రూపొందించబడి, అమలు జరపబడుతూ వుంది. ఈ చట్టం భూస్వామ్య, బడా బూర్జువా వర్గ ప్రయోజనాలను విదేశీ పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదుల ప్రయోజనాలను కాపాడుతున్నది. మిగిలిన వర్గాలను అణచివేతకు, దోపిడీ పీడనలకు గురిచేస్తున్నది.
  3. భారత ప్రజలు భూస్వామ్య, బడా బూర్జువా, సామ్రాజ్యవాద విషపు కోరల్లో చిక్కుబడి వున్నారు. అత్యధికంగా వున్న గ్రామీణ ప్రజలు ప్రధానంగా భూస్వామ్య వ్యవస్థకు బందీలై వున్నారు. ఆకలి, దారిద్య్రం, నిరుద్యోగం, అనారోగ్యం గ్రామీణ పీడిత ప్రజల స్వంత ఆస్థిగా మిగల్చబడ్డాయి. లాటీలు, తూటాలు, సంకెళ్ళు, జైలు కటకటాలు వీరికి ఆభరణాలుగా బహూకరించబడుతున్నాయి. దశాబ్దాల తరబడి బడా బూర్జువా, భూస్వామ్య వర్గాల పాలన ఫలితంగా భారత ఆర్ధిక వ్యవస్థ రోజురోజుకూ మరింత సంక్షోభంలో - సర్వవ్యాపిత సంక్షోభంలో కూరుకుపోతూ వుంది. అభివృద్ధి పేరుతో భారత పాలకులు ఇన్ని సంవత్సరాలుగా అమలు జరిపిన విధానాలన్నీ భూస్వామ్య వ్యవస్థను పరిరక్షించి నిలబెట్టాయి. అన్ని రకాల సామ్రాజ్యవాద, బడా బూర్జువా దోపిడీలను తీవ్రం చేశాయి.
  4. తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం, తెభాగా, త్రిపుర, తిరువాన్కూర్, కొచ్చిన్, పున్నప్ర`వాయిలార్, మందసా, మునగాల, చల్లపల్లి, నక్సల్బరీ, శ్రీకాకుళం మొదలైన రైతాంగ పోరాటాల ఉధృతి ఫలితంగా వాటిని ప్రక్కదారులు పట్టించడానికీ, ప్రజలను భ్రమలలో ముంచెత్తడానికీ పాలకులు కొన్ని బూటకపు సంస్కరణలు ప్రవేశపెట్టారు.
  5. 80 పైగా చేయబడిన వివిధ రాజ్యాంగ సవరణలు గూడా ప్రజలను భ్రమలలో ముంచెత్తడానికీ, భూస్వాముల, బడా పెట్టుబడిదారుల ప్రయోజనాలకీ ఉపయోగపడ్డాయి. అలాగే భూసంస్కరణల చట్టాలు, కౌలుదారీ రక్షణ చట్టాలు, నేటి ఆపరేషన్ బార్గా (పశ్చిమ బెంగాలు) బంజరు భూముల పంపకం, వ్యవసాయ కూలీలకు కనీస వేతన చట్టం, దళితులు, గిరిజనులు తదితర వెనుకబడిన కులాల, వృత్తుల వారి కోసం ప్రకటించిన వివిధ గ్రామీణాభివృద్ధి, సంక్షేమ, సహకార పథకాలు కేవలం నాటకీయంగా అమలు జరపబడుతున్నాయి. గ్రామీణ దళారులకు, నిరంకుశ లంచగొండి అధికారుల జేబులు నింపుకోవడానికీ యివి మంచి వనరులుగా వున్నాయి. అధికారంలో వున్న పార్టీల ఒకప్పటి సోషలిస్టు, అభ్యుదయ నినాదాలు, 20 అంశాల పథకాలు గానీ, నేటి నూతన ఆర్ధిక విధానాలు, ప్రజాకర్షక పథకాలు గానీ ప్రజల జీవితాలను మెరుగు పరచలేదు. వీటి అమలు బూటకమని రుజువయింది.
  6. ఉన్న భూమిని కోల్పోయిన పేద రైతులు, వ్యవసాయ కూలీలు చేసుకొనడానికి చారెడు నేల కోసం తహతహ లాడుతున్నారు. భూస్వాముల వద్దనున్న మిగులు భూమి బినామీ ట్రాన్సఫర్‌లతో మిగులుగా కనబడకుండానే భూస్వామ్యవర్గం దాచుకోగలిగింది. ఇదికాక దేవుడి మాన్యాలనూ, ప్రభుత్వ పోరంబోకు భూములను కూడా తన ఆధీనంలో వుంచుకోగలిగింది. ఎన్ని చట్టాలు వున్నా దేవుడి మాన్యాలనూ, ప్రభుత్వ బంజర్లను సాగు చేసుకునేందుకు ప్రజలకు తోడ్పడటం లేదు. ఈ చట్టాలను అమలు చేయకపోగా దేవాలయాలను జీర్ణావస్థ నుండి బయటపడవేసేందుకన్న సాకుతో దేవాలయ భూములనూ ప్రభుత్వ బంజరులను సాగులోకి తీసుకురావడమన్న పేరుతో బంజరు భూములను అమ్మివేసి పేదలకు దక్కకుండా చేస్తున్నారు. పచ్చదనం పెంచటమన్న పేరిట గ్రామ సమిష్టి భూములను కంపెనీలకు కట్టబెట్టే ప్రతిపాదనలతో ముందుకు వస్తున్నారు. తీర ప్రాంతాల భూములను ఆక్వాకల్చరు పేరిట ధనాఢ్య వర్గాలకు కట్టబెడుతున్నారు.
  7. గిరిజన సంక్షేమ పథకాలు గిరిజనులను ఉద్ధరించింది లేదు. ఫారెస్టు చట్టం, పోడు నిషేధం, వన్యమృగ సంరక్షణ పేరుతో గిరిజనులకు బ్రతుకు మార్గం లేకుండా చేశారు. 1917, 1959, 1970 ట్రైబల్ లాండ్ ట్రాన్స్‌ఫర్ అండ్ రెగ్యులైజేషన్ యాక్టులు గిరిజనుడి భూమి గిరిజనుడికి దక్కేందుకు తోడ్పడలేదు. గిరిజనేతరులు మాత్రమే ఇన్నాళ్ళు గిరిజన భూములు ఆక్రమించుకుంటున్నారు. ఇప్పుడు బడా బూర్జువాలకూ, సామ్రాజ్యవాదులకూ ప్రభుత్వమే కట్టబెడుతున్నది. దీని కోసం గిరిజన చట్టాలు అభివృద్ధికి ఆటంకంగా వున్నాయనీ వాటిని సవరణ పేరిట రద్దుచేసేందుకు పూనుకున్నారు. దీనికి సుప్రీంకోర్టు తీర్పు అడ్డుతగలటంతో ఈ చట్టాలకు మÖలమైన రాజ్యాంగంలోని ఐదవ, ఆరవ షెడ్యూళ్లను సవరించేందుకు పూనుకున్నారు. మరోవైపున అడవుల పెంపకం పేరున వన సంరక్షణ సమితులను ఏర్పరచి గిరిజన రైతులను చెట్లకు నీళ్ళు పోసే రైతులుగా మార్చి అటవీ భూమిపై వారి హక్కును నిరాకరిస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో గిరిజన గ్రామాల చుట్టూ కంచెవేసి వారిని దిగ్బంధనం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో గిరిజన గ్రామాలను తగలబెడుతున్నారు. ఈ అనాగరిక పద్ధతులతో అన్ రిజర్వు అడవి ప్రాంతాన్ని కూడా రిజుర్వు ఫారెస్టులో కలుపుకుంటున్నారు. ఈ విధంగా అక్రమంగా పొందిన ఏజెన్సీ భూములను దోపిడీ వర్గాలకు కట్టబెడుతున్నారు. ఖనిజ సంపదను వెలికితీయటమన్న పేరిట ఏజెన్సీ ప్రాంతాన్నీ సంపదనూ సామ్రాజ్యవాదులకు కట్టబెట్టి గిరిజనులను తరిమివేస్తున్నారు.
  8. గ్రామీణ జనాభాలో అత్యధిక సంఖ్య వ్యవసాయ కూలీలు. వీరు ప్రధానంగా తక్కువ కులాలనబడుతున్న, ఆర్ధికంగా, సాంఘికంగా వెనుకబడిన కులాలకు చెందినవారుగా వున్నారు. వీరిలో వెనుకబడిన కులాల వారేకాక - అగ్రవర్ణాలనబడే వారి సంఖ్య కూడా తక్కువ కాదు. వీరంతా సగటున ఏడాదిలో ఏడెనిమిది మాసాలు నిరుద్యోగం వాతన పడుతుంటారు. కరువు కోరలకు ముందుగా బలయ్యేది వీరే. పొట్ట చేతపట్టుకుని సుదూర ప్రాంతాలకు వలసపోతారు. కుటుంబాలను వదిలివెళ్ళి, నగరాలలో, గనుల్లో నికృష్ట జీవనం గడుపుతారు. కట్టడపు పనుల్లో, ఇటుకబట్టీల వంటి వాటిల్లో పని ప్రదేశాల్లో తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారు. పేద రైతుల చాలీచాలని భూమితో కూలిపనులకు కూడా వెళ్తుంటారు. ప్రభుత్వ కనీస వేతన చట్టాలు అమలు సమగ్రంగా లేదు. సగటు ఆదాయం నికృష్టంగా వుంది. భూస్వాముల దౌర్జన్యాలకు గురవుతున్నారు.
  9. మధ్యతరగతి రైతులు స్వంత భూమితోపాటు కొంత కౌలు చేస్తుంటారు. అధిక కౌళ్ళు, పెరిగిన ఎరువుల ధరలు, నీటి తీరువా, డీజిలు విద్యుత్తు ఛార్జీల మూలంగా నిరంతరం ఒడిదుడుకులకు లోనవుతూ పేదరైతుల స్థాయికి దిగజారిపోతున్నారు. నూతన ఆర్ధిక విధానాలతో వ్యవసాయం గిట్టుబాటుకాక రుణభారంతో కృంగిపోతున్నారు. పేద రైతులతోపాటు వీరు కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
  10. ధనిక రైతులు స్వయంగా భూమిపై శ్రమ చేసేవారుగానూ, కేవలం మేనేజ్‌మెంట్ లేక సూపర్‌వైజ్ చేసేవారు గానూ వున్నారు. ప్రభుత్వం నుండి కొన్ని సౌకర్యాలు పొందగలిగినా, మార్కెట్టు శక్తుల దాడితో పండించిన పంటకు తగిన ఫలితం పొందలేకపోతున్నారు.
  11. చిన్న భూస్వాములు, లిబరల్ భూస్వాములలో ఒక సెక్షన్ గూడా మార్కెట్ ఒడిదుడుకులకు లోనవుతున్నారు. కొంతమంది దివాళా స్థితికి గూడ చేరుకొంటున్నారు. అయినా వీరు వ్యవసాయ కూలీ పేదల పట్ల తమ భూస్వామిక స్వభావంతోనే వ్యవహరిస్తున్నారు.
  12. రాజకీయ పలుకుబడి, లంచగొండి అధికార వర్గంతో, బడా వ్యాపార వర్గంతో సంబంధ బాంధవ్యాలు గల భూస్వామ్య వర్గాన్నీ, పెట్టుబడిదారీ భూస్వామ్య వర్గాన్ని ఈ మార్కెట్ ఒడిదుడుకులు తాకటం లేదు. వారి కోసమే ఈ మార్కెట్ సౌకర్యాలన్నీ వుపయోగపడుతున్నాయి. స్వయంగా రైసు మిల్లులు, చక్కెర తదితర ఫ్యాక్టరీలు నిర్వహించేవారూ వున్నారు. ఈ కోవకు చెందినవారంతా పెట్టుబడిదారీ భూస్వాములుగా వున్నారు. భూస్వామ్య వర్గాన్ని మొత్తంగా తీసుకొంటే గ్రామీణ పీడిత వర్గాలన్నిటిపైన, పంచాయితీ, సొసైటి తదితర సంస్థలపైన ఆధిపత్యాన్ని చలాయిస్తూ వున్నది. భూమి తదితర గ్రామీణ ఆర్ధిక వనరులపై పట్టుగలిగి వుంది. పేదలకు ఫ్యూడల్ దోపిడీ అణచివేతలకు గురిచేస్తూ వుంది.
  13. సముద్ర తీరం వెంబడి నివసిస్తున్న మత్స్యకారులు (పల్లెకారులు, బెస్తలు, గంగపుత్రులు, జాలర్లు మొదలైనవారు) దళారీ వ్యాపారుల దోపిడీకి, ఫ్యూడల్ శక్తుల పెత్తనానికి బలౌతున్నారు. మరబోట్లు, ట్రాలర్లతో చేపలుపట్టే విదేశీ, స్వదేశీ వ్యాపారుల దోపిడీ, దాష్టీకాలకు గురవుతున్నారు. ఆక్వా కల్చరు పేరిట వారి జీవనమే ఛిన్నాభిన్నమైపోతున్నది.
  14. సేవా వృత్తి లేక కుల వృత్తులలో వున్న చాకలి, మంగలి, చేతివృత్తులలో వున్న కమ్మరి, కుమ్మరి, మేదరి, చర్మకారి, వడ్రంగి, గీత, చేనేత, తాపీపని ప్రజలున్నారు. తమ వృత్తుల ద్వారా గ్రామీణ ఆర్ధిక వ్యవస్థలో కీలకమైన పాత్ర నిర్వహిస్తూ దోపిడీకి గురవుతున్నారు. ఆధునిక యంత్ర పరికరాల పెరుగుదల మూలంగా వీరి వృత్తులు బాగా దెబ్బతిన్నాయి. దీని ఫలితంగా కొంతమంది వ్యవసాయ కూలీలుగా మారారు. మరికొంతమంది పట్టణాలకు వలస పోతున్నారు. మొత్తంగా చూస్తే వీరంతా అస్తుబిస్తు బ్రతుకులీడుస్తున్నారు.
  15. గ్రామీణ వ్యవస్థను మొత్తంగా చూస్తే భూస్వామ్య దోపిడీకి కేంద్రంగా వుంది. అధిక వడ్డీలు, నాగులు, గొత్తి, తక్కువ కూలిరేట్లు, వివిధ రూపాలలో వెట్టిచాకిరి, చేసుకోవడానికి పని దొరకని స్థితి. కుల వ్యవస్థ ఫలితంగా సాగుతున్న సాంఘిక దౌర్జన్యాలు, అణచివేత పద్ధతులు - ఇదీ కళ్ళకు కడుతున్న అత్యధిక గ్రామీణ ప్రాంతపు జీవిత చిత్రం.
    ఫ్యూడల్ అహంకారానికి గ్రామీణ పేదలు మొత్తంగానూ; వెనుకబడిన మైనారిటీ కులాల ప్రజలు (దళిత ప్రజలు) వ్యవసాయ కూలీ, పేదరైతు స్త్రీలు ప్రత్యేకంగానూ బలౌతున్నారు. చేసిన శ్రమకు ఫలితాన్ని ముట్టచెప్పటంలో స్త్రీ పురుష వ్యత్యాసం పాటించబడుతున్నది. అంటరానితనం పాటించబడుతున్నది. అగ్రకుల దురహంకారం విలయనృత్యం చేస్తున్నది. స్త్రీల, బాలల శ్రమను కారుచౌకగా భూస్వామ్య వర్గాలు కొనగలుగుతున్నాయి. ఈ దోపిడీ పద్ధతులకి వ్యతిరేకంగా సంఘటితపడకుండా అడ్డుకుంటున్నాయి.
    ఈ పీడిత వర్గాల ప్రజలను ప్రక్కదారులు పట్టించే పథకాలను, రాజకీయ కుట్రలలో కుయుక్తులలో ఆరితేరిన భారత పాలక వర్గాలు విజయవంతంగా అమలు జరుపగలుగుతున్నాయి. ప్రభుత్వ సంస్కరణలపై పెద్దఎత్తున భ్రమలు కల్పించబడుతున్నాయి. పేద ప్రజల పిల్లలు విద్యకు దూరంగా వుంచబడుతున్నారు. మతం పేరుతో, కులం పేరుతో పేద ప్రజల మధ్య చీలికలు కల్పిస్తున్నారు.
    వెనుకబడిన కులాలకు చెందిన నోరుగల సెక్షన్లు టౌట్లు, పెత్తందార్ల, ఉన్నత ఉద్యోగవర్గాల వారి ఆసరాతోనూ, సహకారంతోనూ వెనుకబడిన కులాల ప్రజలందరినీ కుల కట్టుబాటు, మత కట్టుబాట్లలో ఇరికిస్తున్నారు. భూస్వామ్య వ్యతిరేక వర్గ ఉద్యమాలకు దూరం చేసే ప్రయత్నాలు పెద్ద ఎత్తున కొనసాగిస్తున్నారు.
    ఒక్కమాటలో... అత్యంత సున్నితంగా గ్రామీణ పేదలైన రైతుకూలీ పేదల మధ్య అనైక్యత పెంచిపోషించబడుతూ వున్నది.
  16. ప్రజలు సంఘటిత పడుతున్న ప్రతి సందర్భంలో భూస్వాములు తమ గూండాలచే ప్రజలపై దౌర్జన్యం, దమనకాండ సాగిస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం కనుసన్నలలోనే ఇదంతా జరుగుతున్నది. ప్రజలు దృఢంగా, మరింత సంఘటితంగా వుండి వీరి నెదుర్కొంటే శాంతి భద్రతల పేరుతో ప్రభుత్వ పోలీసు యంత్రాంగం భూస్వామ్య వర్గాలకు అండగా వస్తున్నది. భూస్వాములు కూడా తమ ప్రైవేటు సైన్యాలను ఏర్పాటు చేసుకొని నిర్వహించుకొనడానికి ప్రభుత్వ యంత్రాంగం అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నది. బీహారులో భూస్వాముల సేనలలోనూ, రాయలసీమ ఫ్యాక్షన్ ముఠాలలోనూ భూస్వాములు తమ ఆయుధాలకు మందుగుండుగా నిరుపేదలనే వాడుకుంటున్నారు. మారణాయుధాల చట్టం కానీ, అక్రమ జన సమీకరణ చట్టాలు గానీ భూస్వామ్య శక్తులకు వర్తింపచేయబడటం లేదు. అనేక ప్రాంతాలలో భూస్వామ్య శక్తులే ప్రభుత్వ, పోలీసు యంత్రాంగాన్ని, న్యాయ వ్యవస్థనూ కంట్రోలు చేస్తున్నాయి.
    గ్రామీణ అర్థవ్యూడలు వ్యవస్థలోని ఈ దారుణ దోపిడీ పీడన, అణచివేతలను, అసమానతలను రూపుమాపటం; పీడిత ప్రజలందరికీ కనీసం తిండి, గుడ్డ, గూడు వసతిని కల్పించటం; భూస్వామ్య అధికారం స్థానంలో రైతుకూలీల, గ్రామీణ పేదల అధికారాన్ని నెలకొల్పటం రైతుకూలీ సంఘం ప్రప్రథమ ఆశయంగా వుంటుంది.
    దీని కోసం భూస్వాముల మిగులు భూములను, బంజరు ఫారెస్టు భూములను, దేవాలయాల భూములను, తోటలు ఫ్యాక్టరీల వంకతో అక్రమంగా దాయబడిన భూములను పేద ప్రజలు పంచుకోవడం, తద్వారా భూమి కేంద్రీకరణను బ్రద్దలు కొట్టడం రైతు కూలీ సంఘం తన కర్తవ్యంగా స్వీకరిస్తుంది.
    అందుకే రైతు కూలీ సంఘం “దున్నేవానికే భూమి” అనే కేంద్ర నినాదం చుట్టూ గ్రామీణ ప్రాంతంలోని రైతుకూలీ పేదలను సమీకరించి, సంఘటితపరిచి, దుష్ట భూస్వామ్య శక్తుల పెత్తనం, దౌర్జన్యం, దోపిడీ, హింసాకాండ, అణచివేతలను రూపుమాపే వ్యవసాయ విప్లవ కర్తవ్యాలను చేపడుతుంది.

II

  1. ప్రభుత్వం మొదటి పంచవర్ష ప్రణాళికా కాలం నుండీ వ్యవసాయాభివృద్ధి గురించి డంబాలు పలుకుతున్నది. వ్యవసాయాభివృద్ధి, నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణ పథకాలు రూపొందించింది. ఇవన్నీ అస్తవ్యస్థ పథకాలే. భూస్వామ్య, బడా బూర్జువా వర్గాలు తమ ప్రయోజనాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టులను రూపొందించుకుంటున్నాయి. దేశ ప్రజల ప్రయోజనాలను బలిపెడుతున్నాయి.
  2. వ్యవసాయ రంగంలోకి సామ్రాజ్యవాద పెట్టుబడి చొరబాటు కొరకు రూపొందించిన “పైరుపచ్చ విప్లవం” అన్న వ్యూహాన్ని, పై నుండి విప్లవంతో (దిగుబడుల పెంపు) క్రింది నుండి విప్లవాన్ని (రైతుకూలీల భూ పంపక విప్లవం) నివారించవచ్చునన్న వివరణతో ఒప్పించి, దీనిలో భాగంగా సామ్రాజ్యవాద ద్రవ్య సంస్థలైన ప్రపంచబ్యాంకు ఋణమిచ్చి కొన్ని నీటిపారుదలా ప్రాజెక్టులను నిర్మింపచేసింది. వీటిలోనూ దోపిడీ వర్గాల ప్రయోజనాలే వున్నాయి. వీటి నిర్మాణంలోనూ విపరీత జాప్యం చేసి మోయలేని భారం చేశారు. గాదె కింద పందికొక్కుల్లా పాలకులు సాగించిన అవినీతికర చర్యలతో అనతికాలంలోనే ఈ ప్రాజెక్టులు పనికిరాకుండా పోయాయి. కాలువల నిర్మాణంలో శాస్త్రబద్ధతను విడనాడి ప్రాజెక్టుల ప్రయోజనాలను కుదించి వేశారు. విశాల ప్రాంతాలను కరువు బారిన పడవేశారు.
  3. రాయలసీమ, తెలంగాణా, ఉత్తర కోస్తాలోని విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాలు; దక్షిణ కోస్తాలోని ఒంగోలు, నెల్లూరు జిల్లాలు కరువుకాటకాలకు, వలసలు వెళ్లే ప్రజల కేంద్రాలుగా వుంటున్నాయి. రాష్ట్రంలో అడవిగాక నాలుగున్నర కోట్ల ఎకరాలు సాగుకు లాయకైన భూమిలో కోటి 16 లక్షల ఎకరాల భూమి మెట్ట సాగులో వుంది. మిగిలిన కోటి 70 లక్షల ఎకరాల భూమి సాగులోనే లేదు. రెండు మహానదులు కృష్ణా, గోదావరులు, పెన్న, వంశధార వంటి మధ్యతరగతి నదులూ కాక, ఇంకా 40 వరకూ చిన్న నదులు, ఏర్లు ఉన్నాయి. ఈ జలసంపదను వినియోగంలోకి తేవటంలో ప్రభుత్వాలు ఉద్దేశపూరిత నిర్లక్ష్యాన్ని చూపాయి.
    నెహ్రూ ప్రభుత్వం 1961లో గుల్హతి కమీషన్‌ను నియమించింది. 1. పెన్ గంగా - పోచంపాడు, 2. పోచంపాడు - నాగార్జునసాగర్, 3. ఇచ్చంపల్లి - పులిచింతల, 4. పోలవరం - విజయవాడ బ్యారేజి లింకు పథకాలను కమీషన్ ప్రతిపాదించింది. 1980-85లో కేంద్ర జల వనరుల సంస్థ దక్షిణాది నదులను లింకు చేసే పథకాలను రూపొందించింది. ఇంద్రావతి - పెన్ గంగా నదులపై ప్రాజెక్టులు కట్టి, ఆ నీటిని శ్రీశైలం వద్ద కృష్ణా నదిలో కలపటం, ఇచ్చంపల్లి - పులిచింతల, శ్రీరాంసాగర్ - నాగార్జునసాగర్, పోలవరం - కృష్ణా బ్యారేజి పథకాలు ప్రతిపాదించింది. 1983లో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థపై పథకాలను యధాతథంగా బలపరుస్తూ ఇతర పథకాలను కూడా జోడించారు. కానీ ఇవేవీ దశాబ్దాలు గడుస్తున్నా అమలులోకి రాలేదు. పాలకవర్గాలు భూమిని, నీటిని ప్రజల సహజ హక్కుగా నిరాకరించుతున్నందున ఈ అభివృద్ధి పథకాలు అమలు జరపటం లేదు. ప్రజలకు సాగునీరు, త్రాగునీరు అందని పండుగా మారింది.
  4. ప్రాజెక్టుల నిర్మాణానికేకాక, వాటి నిర్వహణకు కూడా సామ్రాజ్యవాదులపై ఆధారపడుతున్నారు. దీని ఫలితంగానే కాలువల నిర్మాణం నేటికీ పూర్తి కాలేదు. మురుగునీటి సమస్య పరిష్కారం కాలేదు. కాలువలలో పూడిక తీయటానికీ, తూటుకాడ తొలగించటానికీ కూడా ఎవరు నిధులిస్తారంటూ దేబిరిస్తున్నారు. సామ్రాజ్యవాదులు షరతులు విధించి నీటి పన్నులనే కాదు, సాగునీటి పంపకాన్ని కూడా నిర్దేశిస్తున్నారు. జనానికి ప్రాణావసరాన్ని వ్యాపార సరుకుగా మార్చారు. ఇక ముందు నీటి నిర్వహణ బాధ్యత ప్రజలదేనంటూ నీటి వినియోగ సంఘాలను పెట్టి తాను వేసే పన్నులుకాక అదనపు పన్నులు వేసేందుకు రంగం సిద్ధం చేశారు.
  5. ఫలితంగా విశాల ప్రాంతాలను శాశ్వత కరువు పీడిత ప్రాంతాలుగా వుంచే బ్రిటీషు సామ్రాజ్యవాదుల విధానమే నేటికీ కొనసాగుతున్నది. ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. నదీ జలాల వినియోగంలో రాష్ట్రాల మధ్య వివాదాలను రెచ్చగొట్టి, ప్రజల మధ్య విద్వేషాలు రగుల్చుతున్నారు. కట్టిన ప్రాజెక్టుల మÖలంగా మునకకు గురైన గిరిజనులకు, ఇతర ప్రజలకూ నష్టపరిహారం చెల్లించకుండా, పునరావాసం కల్పించకుండా నరకయాతన పెడుతున్నారు. పర్యావరణ సమతుల్యతను దెబ్బతీసే బడా బూర్జువా, భూస్వామ్య వర్గాల ప్రయోజనాలను కాపాడుతున్నారు.
  6. సామ్రాజ్యవాదుల, వారి దళారీల పరిశ్రమల కొరకు, అడవులను నరికివేస్తున్న కారణంగా భూసార కోత పెరిగి, నీటి పారుదల ప్రాజెక్టుల రిజర్వాయర్లు పూడిపోతున్నాయి. ప్రాజెక్టులు పూర్తిగా వినియోగంలోకి రాకుండానే పూడికతో నిరుపయోగమవుతున్నాయి. కానీ గిరిజనుల పోడు వ్యవసాయం నిషేధించబడుతున్నది. సామాజిక అడవుల పథకం పేరుతో గిరిజనుల సాగు భూములనూ, పేదల ప్రజల చేతులలోని బంజర్లనూ ఆక్రమించి, వారిని భూముల నుండి వెళ్ళగొడుతున్నది. అడవిని నాలుగైదు రకాల చెట్లను దౌర్జన్యంగా నాటించి జీవ వైవిధ్యాన్ని నాశనం చేస్తున్నది ఈ ప్రభుత్వమే. గిరిజన జీవితంలోని సమిష్టి, స్వేచ్ఛా, సంస్కృతి, సాంప్రదాయాలను పాలకవర్గాలు నాశనం చేయబూనుకున్నాయి. ప్రకృతితో వారి అనుబంధాన్ని తెగగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి.
  7. చిన్న కమతాల వల్ల గట్ల కోసమే విలువైన భూమి వృధా కావటమేకాక ఆధునిక సాగు పద్ధతులు అవలంబించేందుకు ఆటంకమన్న పేరుతో పేదరైతుల భూములను భూస్వాముల క్షేత్రాలలో కలిపివేసే ల్యాండ్ కన్సాలిడేషన్‌ను తెచ్చారు. పైరుపచ్చ విప్లవం పేరుతో సామ్రాజ్యవాదులు, వారి దళారులు తయారుచేసే రసాయనిక ఎరువులు, చీడ మందులు, పరికరాలు, వంగడాలపై ఆధారపడే దుస్థితికి రైతాంగం నెట్టబడ్డారు. నూతన వ్యవసాయ రంగ విధానాలతో రైతును అప్పులపాల్జేసి కంపెనీలు చెప్పిన పంటను వేసి వాటికే అమ్మే కాంట్రాక్టు లేదా కార్పొరేటు పద్ధతిని ప్రోత్సాహిస్తున్నారు. పట్టాలెవరి పేరనున్నా, రైతుల భూమినంతటినీ ఒక కంపెనీ ఆధీనంలోకి తెచ్చి, రైతును పెద్దపాలేరు స్థాయికి దిగజార్చే విధానమిది.
  8. దోపిడీ వర్గాల ఖజానాను నింపిన ఫలితంగా ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిపోయి లోటు బడ్జెట్టు విధానాన్ని ప్రభుత్వం అవలంబిస్తున్నది. ఈ లోటును పూడ్చుకొనడానికి రైతాంగంపై పన్నుల భారాన్ని పడవేస్తున్నది. భూమి శిస్తు, నీటితీరువా, డ్రైనేజి సెస్సులు, బెటరుమెంటు సెస్సులు, కరెంటు ఛార్జీలు మొదలగునవి రైతాంగంపై విధిస్తున్న ప్రత్యక్ష పన్నులు; వ్యవసాయ ఉపకరణాలు (పనిముట్లు), ఎరువులు, పురుగుమందుల నిత్యావసర వస్తువులపై వివిధ రూపాల్లో విధించబడుతున్న పరోక్ష పన్నులు వీటి వలన రైతు ఆదాయంలో ప్రధానభాగం తినివేయబడుతుంది. రైతులకు వారి స్వంత శ్రమ, కూలీల శ్రమ ద్వారా మిగిలే అదనపు విలువ మాత్రమే కొంత ఆదాయంగా వుంటుంది. ఎక్కువ సందర్భాలలో ఈ శ్రమ విలువ కూడా మిగలక రైతులు అత్యంత దీనావస్థలో వుంటున్నారు. అప్పలపాలవుతున్నారు. వున్న భూమిని అమ్ముకొని వలసలు పోతున్నారు.
  9. నీలి విప్లవం పేరుతో ప్రభుత్వం బడా బూర్జువా, భూస్వామ్య వర్గాలకు సముద్ర తీర భూములను కట్టబెట్టి గ్రామీణ పేదలకు అనేక సమస్యలను సృష్టిస్తున్నది. చేపలు, రొయ్యలు పెంపక రంగంలోని పిల్లల ఉత్పత్తి (హేచరీస్), కోళ్ళు (పౌల్ట్రీ), మేత, మందులు, మార్కెటింగులలో సామ్రాజ్యవాదులు, వారి దళారులు గుత్తాధిపత్యం కలిగి ఉండి చిన్న రైతులను దోపిడీ చేస్తున్నారు. బ్రతుకు తెరువు కోసం కృషి చేస్తున్న కృషీవలుడు చితికిపోతున్నాడు.
  10. కో-ఆపరేటివ్ సొసైటీలు, భూమి తనఖా బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు, భూస్వాముల ప్రాపకంలో వున్నాయి. పేద, మధ్యతరగతి రైతులకు వీటి ద్వారా లభించే మేలు దాదాపు శూన్యం. భూస్వాములే ఈ బ్యాంకుల ద్వారా కూడా రుణాలు తెచ్చి అంతకంటే అధిక వడ్డీలకు రైతులకు యిస్తున్నారు. వ్యవసాయ రుణాలకు అర్ధరూపాయకు మించి వడ్డీ వసూలు చేయరాదని చట్టం నిర్దేశిస్తూ వుంటే, జాతీయం చేసిన బ్యాంకులు అధిక వడ్డీ వసూలు చేయడం, సకాలంలో చెల్లించలేదని అపరాధపు వడ్డీలు వేసి జప్తులు చేస్తున్నాయి. తద్వారా రైతాంగాన్ని దుర్భర స్థితుల్లోకి నెడుతున్నాయి. పంటల భీమా పథకాల్లాంటి చిట్కాలతో రైతాంగానికి ఆశపెట్టి, మోసం చేయడానికి రంగం సిద్ధం చేయబడుతూ వున్నది.
  11. కష్టపడి పండించిన పంటకు సరైన ధరలు లేక రైతాంగ ఆర్ధిక పరిస్థితి ఊహించని పరిణామాలకు లోనవుతున్నది. ఎఫ్‌సిఐ, ఎస్‌టిసి, సిసిఐ మార్కెటింగ్ ఫెడరేషన్, గిరిజన కార్పొరేషన్ తదితర సంస్థల విధానాలు, నిర్వహణా తీరు రైతులకు గిట్టుబాటు ధర చెల్లించేందుకు దోహదపడకపోగా దోపిడీదారులకు (విదేశీ, స్వదేశీ దళారీలు, బడా భూస్వాములు, బడా మిల్లర్లు) లాభం చేకూర్చే విధంగా వున్నాయి. మార్కెట్‌పై తమకున్న గుత్తాధిపత్యంతో ఈ సంస్థలు, బడా వ్యాపార వర్గం ధరలను నిరంతరం తారుమారుచేస్తూ రైతాంగం నుండి చౌకగా కొనుగోలు చేస్తున్నారు. కొన్న దానికి వెంటనే డబ్బు చెల్లించకుండా రైతాంగాన్ని వేధిస్తున్నారు. ముఖ్యంగా వ్యాపార పంటలు పండించిన రైతాంగం అత్యధికంగా పేద, మధ్యతరగతి రైతాంగం మార్కెట్ అసౌకార్యాలతో, అందులో జరుగుతున్న మోసాలతో అత్యంత ఘోరమైన స్థితిలో పడిపోతున్నారు. ప్రభుత్వ బడా వ్యాపారవర్గ, బడా బూర్జువా వర్గ, సామ్రాజ్యవాద అనుకూల విధానాలే రైతాంగపు ఈ సంకట సంక్షోభాలకు పుష్కలంగా వున్నాయి.
  12. ఈ సంక్షోభ ప్రభావానికి నిరంతరం గురవుతున్నదీ, సంక్షోభ దుష్ట ఫలితాలను అనుభవిస్తున్నదీ ప్రధానంగా వ్యవసాయ కూలీలు, ఆకలిచావులకూ, అంటువ్యాధులకు గురవుతున్నది కూడా వీరే. వ్యవసాయంలో వారి శ్రమ మిళితమై ప్రధాన పాత్ర వహిస్తూ వుంది. ఆ విధంగా రైతు స్వభావం కలిగివున్నప్పటికీ భూమికి దూరం చేయబడి, భూమిలేని రైతులుగా, పేదలుగా మిగిలిపోతున్నారు. వెట్టిచాకిరి వారిని బానిసలను చేస్తున్నది. భరించరాని వడ్డీలతో వున్న అప్పులు వారిని ఫ్యూడల్ దోపిడీకి కట్టిపడవేస్తున్నాయి. చేసుకొనడానికి పని దొరకని స్థితిలో బ్రతుకుతెరువు వెతుకుతూ వివిధ ప్రాంతాలు తిరిగే స్థితిలో వున్నారు. పట్టణాలకు వలసపోయి రిక్షాలు తొక్కటం, అంట్లు తోమటం, మూటలు మోయడం లాంటి వృత్తులలో జేరి కడుపునింపుకుంటున్నారు. కొంతమంది కర్మాగారాల్లో వెట్టిచాకిరీకి కుదురుతున్నారు. కాంట్రాక్టు కార్మికుల పేరుతో వీరిచేత అత్యధిక గంటలు పనిచేయిస్తున్నారు. వీరికి ఏ కార్మిక చట్టాలు, ఫ్యాక్టరీ చట్టాలు వర్తింపబడవు. మురికివాడలలో అత్యంత దీనావస్థలో వీరి జీవితాలు సాగుతున్నాయి.
    వ్యవసాయ రంగంలో ఈ సంక్షోభానికి కారణభూతమైన సామ్రాజ్యవాదుల, వారి దళారుల దారుణ దోపిడీ, హింసాకాండలనూ, భారత ప్రజల మూల్గులను పీల్చే వీరి విధానాలనూ రూపుమాపి, భారత ప్రజలకు స్వేచ్చా, స్వాతంత్య్రాలను సాధించటం రైతు కూలీ సంఘం ఆశయంగా వుంటుంది.
    సామ్రాజ్యవాద దోపిడీ, జోక్యందారీ విధానాలనూ, భారత ప్రభుత్వ, పాలకవర్గాల సామ్రాజ్యవాదులకు ఊడిగం చేసే విధానాలనూ ఎండగట్టడం; పరిశ్రమలలో సామ్రాజ్యవాదుల మిలాఖత్తును, వారి పెటుట్టడులను వ్యతిరేకించటం; భారత ప్రభుత్వం సామ్రాజ్యవాదులతో చేసుకున్న అన్ని రకాల అసమాన ఒప్పందాలను ప్రతిఘటించడం; భారత గడ్డపై సామ్రాజ్యవాద దోపిడీని రూపుమాపడం రైతు కూలీ సంఘం తన లక్ష్యంగా స్వీకరిస్తున్నది.
    సమగ్ర నీటి పారుదల పథకాలను సత్వరం అమలు జరపడం ద్వారా కరువును శాశ్వతంగా నివారించడం కోసం; కరువుకు తక్షణ, తాత్కాలిక ఉపశమన చర్యలు తీసుకోవడం కోసం; పరోక్ష పన్నుల భారం తగ్గించటం కోసం; చీడల నివారణ బాధ్యత ప్రభుత్వమే చేపట్టడం కోసం; ఎరువులలో కల్తీ నిరోధించడం కోసం; రైతు కూలీ సంఘం గ్రామీణ ప్రజానీకాన్ని ఆందోళనోద్యమాల్లోకి సమీకరిస్తుంది.
    అలాగే సామ్రాజ్యవాదుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడే వ్యవసాయ విధానాలనూ; ప్రాజెక్టుల నిర్మాణ, నిర్వహణల్లో సామ్రాజ్యవాద, దళారీ నిరంకుశాధికార, ఫ్యూడల్ అనుకూల విధానాలనూ వ్యతిరేకిస్తుంది. వీటిలో భాగంగానే ప్రభుత్వ సామ్రాజ్యవాద అనుకూల విధానాలనూ, అడుగులకు మడుగులొత్తే విధానాలను ప్రతిఘటించడానికి గ్రామీణ పేదలను సంఘటితపరిచే కర్తవ్యాన్ని రైతుకూలీ సంఘం చేపడుతున్నది.

III

మొత్తంగా గ్రామీణ ప్రజల బ్రతుకులు అతి దుర్భరంగా వున్నాయి. ఈ దోపిడీ రూపాలలో, పద్ధతులలో ప్రాంత, ప్రాంతానికీ తేడాలున్నాయి. ఈ బడుగు జీవులనుభవిస్తున్న దుర్భరత్వంలో కూడా ప్రాంత ప్రాంతానికీ వ్యత్యాసాలున్నాయి. కాని దోపిడీ స్వభావం మాత్రం ఒక్కటే. దీనిని ప్రతిఘటించడానికి సంఘటితపడే ప్రజలను అణచడంలో భూస్వాములతో బాటు, ప్రభుత్వ యంత్రాంగం ముందు పీఠిన వుంటున్నది. కల్లోలిత ప్రాంత చట్టం, టెర్రరిస్టు చట్టం, నాసా లాంటివి ప్రయోగిస్తున్నది. ఆ విధంగా ప్రజలు సంఘటితపడే హక్కు కాలరాయబడుతున్నది.

ఈ పాశవిక ప్రభుత్వ నిర్బంధ చట్టాలను, చర్యలను ప్రతిఘటించడం, ప్రజాతంత్ర హక్కుల కోసం పోరాడటం రైతు కూలీ సంఘం మూడవ ఆశయంగా వుంటుంది. నిర్బంధానికి, అణచివేతకు వ్యతిరేకంగా సాగుతున్న కార్మిక, ఉద్యోగ, విద్యార్ధి, ఉపాధ్యాయ, పట్టణ పేదల ప్రజాతంత్ర హక్కుల ఉద్యమాలలో రైతుకూలీ సంఘం భుజం భుజం కలిపి పోరాడుతుంది.

IV

అత్యధిక జనాభా గల గ్రామీణ ప్రాంతం నేటికీ అన్న విధాలా వెనుకబడి వుంది. ప్రజల జీవితాలను ప్రభావితంజేసే ప్రధాన ఉత్పత్తి వనరు భూమి. అది భూస్వాముల చేతులలో కేంద్రీకరించబడి వుంది. దానిపై రైతుకూలీ పేదలకు హక్కు ఏర్పడకుండా భూస్వామ్య వర్గాలు చట్టాలను తారుమారు చేస్తున్నాయి. ఆర్ధికంగా, సాంఘికంగా, సాంస్కృతికంగా గ్రామసీమల అభివృద్ధి కృషి కుంటినడకగా సాగుతున్నది.

వ్యవసాయ రంగాభివృద్ధికి, నదీజలాల ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన పునాది పరిశ్రమలు, (ఇనుము, ఉక్కు, సిమెంటు) సకాలంలో త్వరితగతిన నిర్మించలేని దళారీ విధానాలు గ్రామీణ ప్రజల అభివృద్ధిని ఆటంకపరుస్తున్నాయి. వారి కొనుగోలు శక్తిని దెబ్బతీస్తున్నాయి. దేశ పారిశ్రామిక అభివృద్ధిని సామ్రాజ్యవాదుల దయాదాక్షిణ్యాలకు వదిలి స్వయంపోషక, స్వయం సమృద్ధి మార్గములో భారత ప్రజలను అడుగుపెట్ట నిరోధిస్తున్నది. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులకు పరివర్తన చెందే మార్గాలనడ్డుకొంటున్నది. ప్రణాళికా బద్ధంగా వ్యవసాయం, పరిశ్రమల మధ్య సమన్వయాన్ని నిరాకరిస్తున్నది. ఈ విధంగా భారత బడా బూర్జువా, భూస్వామ్యవర్గాలు అభివృద్ధి నిరోధక పాత్ర నిర్వహిస్తున్నాయి. సామ్రాజ్యవాదుల అదుపు, ఆజ్ఞలలో, కనుసన్నలలో నడుస్తున్నాయి.

భారత సామాజిక వ్యవస్థను అభివృద్ధి నిరోధకత్వంలో ముంచివేస్తూ, ప్రగతి నిరోధకంగా వున్న భారత పాలక వర్గాల, సామ్రాజ్యవాదుల కుట్రను ఓడించటం రైతు కూలీ సంఘం ఆశయంగా వుంటుంది.

భారత పాలకుల సామ్రాజ్యవాద, బడా బూర్జువా అనుకూల విధానాలకు వ్యతిరేకంగా పీడిత ప్రజలందరితోను, జాతీయ శక్తులన్నింటితోను రైతు కూలీ సంఘం సఖ్యత నెరుపుతుంది. పాలకవర్గాల అభివృద్ధి నిరోధకత్వాన్ని పట్టణ కార్మిక వర్గంతో చేయి చేయి కలిపి ప్రతిఘటిస్తుంది.

ప్రపంచంలోని వివిధ దేశాలలోని దోపిడీ శక్తులను, సామ్రాజ్యవాద తొత్తులను ప్రత్యక్షంగా వున్న సామ్రాజ్యవాద అగ్రరాజ్య ఆధిపత్య శక్తులను వ్యతిరేకిస్తున్న ప్రజలతోను, అక్కడి జాతీయ విముక్తి ఉద్యమాలతోను ఇరుగుపొరుగు దేశాలతో నిజమైన మైత్రి కోసం సాగే ఉద్యమాలతోనూ రైతు కూలీ సంఘం సంఘీభావ దృక్పథం కలిగి వుంటుంది. అగ్రరాజ్య యుద్ధ ప్రయత్నాలను, దురాక్రమణ, విస్తరణకు చర్యలను వ్యతిరేకించే శక్తులతో గొంతు కలుపుతుంది. యుద్ధాన్ని వ్యతిరేకిస్తుంది. నిజమైన ప్రపంచ శాంతిని కాంక్షిస్తున్నది.

గ్రామీణ ప్రాంతంలోని రైతుకూలీ పేదలు భూస్వామ్య శక్తులకు, బడా బూర్జువా సామ్రాజ్యవాద శక్తులకు వ్యతిరేకంగా సంఘటితపడతారు. పేద రైతులు, వ్యవసాయ కూలీలు ప్రధాన శక్తిగా, మధ్యతరగతి రైతాంగం, చేతివృత్తులు, కులవృత్తులకు చెందిన గ్రామీణ పేద ప్రజల వర్గ సంఘంగా వుంటుంది. చిన్న వ్యాపారస్తుల, పేదలతో మిత్రపూరితంగా వుండే ధనిక రైతులతో కూడిన సంఘటన ద్వారా రైతు కూలీ సంఘం తన కర్తవ్యాల సాధనకు విశాల వేదికను రూపొందించుకుంటుంది. కార్మిక, కర్షక ఐక్యత పునాదిపై నూతన ప్రజాతంత్ర వ్యవస్థ కోసం, వ్యవసాయ విప్లవం కోసం జరిగే పోరాటంలో ఈ సంఘం ప్రధాన పాత్ర నిర్వహిస్తుంది.

రైతు కూలీ సంఘం కుల, మత, జాతి, లింగ వివక్ష లేకుండా గ్రామీణ పేదలందరినీ సంఘటిత పరుస్తుంది. ఫ్యూడల్ అహంలో భాగమైన కుల, మత, జాతి, పురుష దురహంకారాలకు అతీతంగా భూస్వామ్య వ్యతిరేక పోరాటంలో అందరినీ సమైక్యంగా, సమరశీలంగా నడిపిస్తుంది. గ్రామీణ పేదలను రాజకీయంగా, సాంఘికంగా, సాంస్కృతికంగా చైతన్యవంతుల్ని చేస్తుంది. సమరశీలురుగా మలుస్తుంది. సుత్తి కొడవలి గల ఎర్రజెండా సంఘం పతాకంగా ఉంటుంది.